మనిషికి 'బర్డ్‌ ఫ్లూ' సోకిందన్న ప్రచారం అవాస్తవం: వైద్యారోగ్య శాఖ

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్ల మరణాలతో మొదలైన బర్డ్ ఫ్లూ ఆందోళనలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది.

By -  అంజి
Published on : 21 Feb 2026 9:13 AM IST

AP Bird Flu News, Avian Influenza Chittoor, Annamayya District Poultry, Health Commissioner Veerapandiyan, Chicken Safety Tips, Bird Flu Control Room Madanapalle

మనిషికి 'బర్డ్‌ ఫ్లూ' సోకిందన్న ప్రచారం అవాస్తవం: వైద్యారోగ్య శాఖ

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్ల మరణాలతో మొదలైన బర్డ్ ఫ్లూ ఆందోళనలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎక్కడా మనుషులకు బర్డ్ ఫ్లూ సోకలేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేశారు.

చిత్తూరు జిల్లాలో ఒక యువకుడికి ఏవియన్ ఇన్​ఫ్లుయంజా సోకిందంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కమిషనర్ కొట్టిపారేశారు. సదరు యువకుడితో పాటు అనుమానిత లక్షణాలున్న మరో 54 మంది నమూనాలను తిరుపతి స్విమ్స్‌లో పరీక్షించగా, అందరికీ నెగిటివ్ అని తేలిందని వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు.

కోళ్ల ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ప్రభావిత ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి ఓసెల్టామివర్ మాత్రలు, N-95 మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ముందు జాగ్రత్తగా చిత్తూరు, మదనపల్లె ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులను, బెడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర నిపుణుల బృందం ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని గమనిస్తోంది.

చికెన్, గుడ్లు తినవచ్చా?

ఈ విషయంలో ప్రజలకు ఉన్న సందేహాలపై అధికారులు స్పష్టతనిచ్చారు. 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించిన చికెన్, గుడ్లు తినడం పూర్తి సురక్షితమని పేర్కొన్నారు. అయితే, సగం ఉడికించిన మాంసం లేదా గుడ్లను మాత్రం తీసుకోవద్దని సూచించారు.

అన్నమయ్య జిల్లాలో పరిస్థితి

సదుం మండలం పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె వంటి గ్రామాల్లో నాటుకోళ్లు పెద్ద సంఖ్యలో మరణించిన నేపథ్యంలో, భోపాల్ ల్యాబ్ పరీక్షల్లో అక్కడ బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లెలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అనుమానాలున్న వారు 70139-14401 లేదా 93982-62752 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.

Next Story