బడ్జెట్‌లో ఏపీకి మొండి చేయి.. వైసీపీ నేతలు ఎమన్నారంటే..?
No allocations for AP in Union Budget.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
By తోట వంశీ కుమార్ Published on 1 Feb 2021 4:18 PM ISTకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా..ఈ బడ్జెట్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెదవి విరిచారు. బడ్జెట్ లో ఏపీపై సవతి ప్రేమను ప్రదర్శించారని మండిపడ్డారు. ఈ బడ్జెట్ తమను ఎంతో నిరాశపరించదన్నారు. గతంలో వచ్చిన బడ్జెట్‌ల కంటే చాలా చెత్తగా ఉందన్నారు. ఏ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. అన్ని విషయాల్లో ఏపీకి మొండి చేయి చూపించారని విమర్శించారు. ఏపీ విభజన జరిగినప్పటికి నుంచి విశాఖ, విజయవాడకు మెట్రో రైలు అడుగుతూనే ఉన్నామని అయితే బడ్జెట్‌లో వాటి ప్రస్తావనే లేనేలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలపై బడ్జెట్ లో ప్రస్తావించలేదని విజయసాయి దుయ్యబట్టారు.
విజయవాడ-ఖరగ్ పూర్ రవాణా కారిడార్ వల్ల ప్రయోజనం లేదని.. ఎక్కువ సంఖ్యలో కిసాన్ రైళ్లను వేయాలని కోరినా పట్టించుకోలేదని, ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే చేసిందన్నారు. రాష్ట్రానికి ఒక వైరాలజీ సెంటర్ కేటాయించాలని కోరారు. ధాన్యం సేకరణలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని.. రాష్ట్రంలో 26 జిల్లాలు చేయబోతున్నామని.. ప్రతి జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్ర బడ్జెట్ చాలా నిరాశ పరిచిందని వైకాపా లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రసావనే లేదన్నారు. నరేగా నిధులు, రోడ్ల అభివృద్దికి కేటాయింపులు సరిగా లేకున్నా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకొస్తామన్నారు. రాష్ట్రానికి 20 వేల కోట్లు రెవెన్యూ లోటు ఉందన్నారు. ఎంపీలందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి నిధులు తీసుకువస్తామని ఆయన తెలిపారు.
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. రైల్వే జోన్‌కు నిధులు కేటాయించకపోవడం నిరాశ పరిచిందని, ఫిషింగ్ హార్బర్ కేటాయించడం ఒక కంటి తుడుపు చర్యగా ఆయన పేర్కొన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు పెంచాలని, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు.