ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Nimmagadda releases AP Panchayat election notification.ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది.
By తోట వంశీ కుమార్ Published on 23 Jan 2021 11:00 AM ISTఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. శనివారం ఉదయం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి విడుత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు.
రాజ్యాంగ ఆదేశాల మేరకు ఎన్నికలను సకాలంలో నిర్వహించడం ఎన్నికల కమిషన్ విధి అని అన్నారు. అయితే.. సుప్రీం తీర్పును తక్షణం పాటిస్తామన్నారు. ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పు సహేతుకమేనని.. ఎస్ఈసీ వాదనను హైకోర్టు విశ్వసించిందన్నారు. ఎస్ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయతతో ఉన్నాయని... కరోనా వ్యాక్సినేషన్ చేపడుతూనే ఎన్నికలు నిర్వహించవచ్చునని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయని.. నిన్న హాజరు కావాలని కోరినా అధికారులు రాలేదన్నారు. వైఫల్యానికి కారణమైన అందరిపై చర్యలు ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి హాజరుకావాలని కోరాం. ఎన్నికల జాబితా సకాలంలో అందించడంలో పంచాయతీరాజ్ అధికారులు విఫలమయ్యారు. విధిలేని పరిస్థితుల్లో 2019 జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ రోజు జారీ చేసిన నోటిఫికేషన్ తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25న అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్ల పరిశీలిస్తారు. అనంతరం 29న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం, 31న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 5న తొలి విడుత పోలింగ్.. అదే రోజు ఫలితాలు ఉంటాయని వెల్లడించారు. ఉదయం 6.30 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు పోలీంగ్.. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందన్నారు.