ఏపీలో స్థానిక ఎన్నిక‌ల‌ను విజ‌యవంతంగా నిర్వ‌హించామ‌ని.. ప్ర‌భుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్య‌మైంద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం ప‌ద‌వి విర‌మ‌ణ చేయ‌నున్న సంద‌ర్భంగా ఈ ఉద‌యం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌లు, హైకోర్టు వ్యాఖ్య‌లు, కీల‌క నిర్ణ‌యాల‌ను ఈ సంద‌ర్భంగా ఎస్ఈసీ గుర్తు చేసుకున్నారు. తనకు గతంలో తెలంగాణలో ఓటు హక్కు ఉండేదని, దాన్ని స్వగ్రామానికి మార్చుకుందామని భావించానని, తన ఓటును తాను మార్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడి నుంచైనా ఒకసారి ఓటు వేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికీ ఉందని, తన హక్కుల సాధనకు ఓ సామాన్య పౌరుడిగా రేపటి నుంచి పోరాడతానని.. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కును ఎవ‌రూ కాద‌న‌డానికి వీల్లేద‌న్నారు. ఇక గవర్నర్ అపాయింట్ మెంట్ తనకు లభించలేదని వచ్చిన వార్తలపై స్పందించిన ఆయన.. ఇటీవల టీకాను తీసుకున్న గవర్నర్, కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లాల్సి వున్న కారణంగా,మంగళ, బుధ వారాల్లో ఎవరినీ కలవబోవడం లేదని తనకు సమాచారం అందిందని అన్నారు. త్వరలోనే గవర్నర్ ను కలిసి తాను పదవిలో ఉన్న సమయంలో తయారు చేసిన రిపోర్టును అందిస్తానని స్పష్టం చేశారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story