అనారోగ్యం పాలైన 800 మంది IIIT నూజివీడు విద్యార్థులు.. ఆందోళన రేకెత్తిస్తున్న వరుస ఘటనలు!

ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చోట్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలు చోటుచేసుకున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Aug 2024 4:45 AM GMT
nhrc,   food poisoning cases,  Andhra, educational institutions,

అనారోగ్యం పాలైన 800 మంది IIIT నూజివీడు విద్యార్థులు.. ఆందోళన రేకెత్తిస్తున్న వరుస ఘటనలు!

ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చోట్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యాసంస్థలు, అనాథ శరణాలయాల్లో ఆహార ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తాజాగా నూజివీడులోని ఐఐఐటీలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆగస్టు 27న నూజివీడులోని ఐఐఐటీలో దాదాపు 340 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మూడు హాస్టల్ మెస్‌లలో భోజనం తిన్న విద్యార్థినులకు జ్వరం, వాంతులు, విరేచనాలు అయ్యాయి. నివారణ చర్యలు చేపట్టడంలో యాజమాన్యం జాప్యం చేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. "నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నన్ను ఆందోళనకు గురిచేసింది. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను అదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది." అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

బుధవారం సమాచార పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి క్యాంపస్‌లోని ఫుడ్‌ కోర్టును పరిశీలించారు. చాలా అపరిశుభ్ర వాతావరణంలో సిబ్బంది వంట చేస్తున్నట్టు గుర్తించారు. ఆహారం, మాంసం రోజుల తరబడి నిల్వ చేశారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు నెలలో ఫుడ్ పాయిజన్ కావడం ఇది నాలుగోసారి. ఆగస్టు నెలలో మొదటి సంఘటన ఆగస్టు 18న నివేదించారు. విద్యాసంస్థలు, అనాథాశ్రమాలలో ఆహారం తిన్న ముగ్గురు విద్యార్థులు మరణించారు. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్శిటీ, అనకాపల్లి జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో చోటుచేసుకున్న ఘటనలు దేశ దృష్టిని ఆకర్షించాయి. అనకాపల్లి, చిత్తూరులో ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా విద్యార్థులు, అనాథలకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) విచారణ చేపట్టింది. ఎన్‌హెచ్‌ఆర్‌సి ఒక ప్రకటనలో ఆహార భద్రత, నాణ్యతను నిర్ధారించడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా నివేదికలు ఖచ్చితమైనవి అయితే, ఈ సంఘటనలు మానవ హక్కుల ఉల్లంఘనను సూచిస్తాయని కమిషన్ హైలైట్ చేసింది. NHRC ప్రధాన కార్యదర్శి.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ కు నోటీసులు జారీ చేసింది. రెండు సంఘటనలపై రెండు వారాల్లో వివరణాత్మక నివేదికలను కోరింది. ఈ కేసుల్లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ల స్థితి, బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకున్న చర్యలు లేదా ప్రతిపాదించిన అంశాలను నివేదికలో పొందుపరచాలని భావిస్తున్నారు.

ఆహార కల్తీలో ఏపీ మొదటి స్థానంలో ఉంది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ పాయిజన్ వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019, 2022 మధ్య కాలంలో ఆహార కల్తీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2022లో దేశంలో ఆహారం/మాదక ద్రవ్యాల కల్తీ లేదా విక్రయాలకు సంబంధించి మొత్తం 4,694 నేరాలు నమోదయ్యాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో 2,828 నమోదయ్యాయి.

ఏయే సంఘటనలు జరిగాయి:

ఆగస్టు 18న అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని ఓ అనాథ ఆశ్రమంలో కల్తీ ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, 23 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. అనాథాశ్రమంలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంలో పిల్లలు సమోసా, చాక్లెట్లు తిన్నారు. దీన్ని మరొక సంస్థచే స్పాన్సర్ చేసింది. ఈ ఘటన అనంతరం కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామాలకు వెళ్లిపోయారు.

భవానీ, శ్రద్ధ, నిత్య అనే ముగ్గురు విద్యార్థినులు ఆగస్టు 18న వాంతులు, అస్వస్థతకు గురయ్యారు. మరుసటి రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని స్వగ్రామంలో మృతి చెందారు. ఆదివారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన 24 మందికి పైగా విద్యార్థులు వాంతులు, అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆసుపత్రుల్లో చేర్పించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. కిరణ్ కుమార్ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో ASR జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుండి సుమారు 86 మంది పిల్లలు ఉన్నారు. వారు అనాథాశ్రమంలో ఉంటూ సమీపంలోని పాఠశాలల్లో చదువుతున్నారు. ఘటన జరిగిన వెంటనే రెవెన్యూ, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు అనాథ శరణాలయాన్ని సందర్శించి ఫుడ్‌ పాయిజనింగ్‌కు గల కారణాలను తెలుసుకున్నారు.

చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్శిటీలో ఆగస్టు 21న 70 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, బాధితులందరూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆగస్టు 27న కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకులం పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 20 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. వాంతులు చేసుకోవడంతో విద్యార్థులను ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పాఠశాలలోని క్యాంటీన్‌లో అపరిశుభ్రత నెలకొనడం వల్లే ఈ ఘటనలకు కారణమని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story