కోచింగ్‌ సెంటర్లకు కొత్త రూల్స్‌.. రోజుకు 5 గంటలే.. అలా చేస్తే రిజిస్ట్రేషన్‌ రద్దు

రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ ఉన్నత విద్యాశాఖ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

By -  అంజి
Published on : 28 March 2026 7:07 AM IST

Coaching Center Regulations, Higher Education Department, Student Suicide Prevention, Wellness Centers, Kona Sashidhar, Coaching Fee Refund Policy, District Level Monitoring Committee

కోచింగ్‌ సెంటర్లకు కొత్త రూల్స్‌.. రోజుకు 5 గంటలే.. అలా చేస్తే రిజిస్ట్రేషన్‌ రద్దు

అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ ఉన్నత విద్యాశాఖ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించి, ఆత్మహత్యలను నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త రూల్స్ ప్రకారం.. కోచింగ్ సంస్థలు రోజుకు గరిష్ఠంగా 5 గంటలు మాత్రమే పనిచేయాలి. ఆదివారంతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహించడంపై పూర్తి నిషేధం విధించారు. అలాగే, ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి, వేధింపులకు తావులేకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కోచింగ్ సెంటర్ల నిర్వహణలో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆత్మహత్యలను నిరోధించేందుకు హాస్టళ్లలో స్ప్రింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, బాల్కనీలు, టెర్రస్‌లపైకి విద్యార్థులు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి సంస్థ తన ఫ్యాకల్టీ, ఫీజుల వివరాలతో కూడిన సొంత వెబ్‌సైట్‌ను నిర్వహించాలి. విద్యార్థులు మధ్యలో కోర్సు మానేస్తే, మిగిలిన కాలానికి సంబంధించిన ఫీజును తిరిగి చెల్లించాలని (Refund), అలాగే విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తమ వద్ద ఉంచుకోకూడదని నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్లు ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో పనిచేయడంపై కూడా నిషేధం విధించారు.

విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం ప్రతి సంస్థ ఒక వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. స్థానిక ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని సైకాలజిస్ట్‌ల ద్వారా క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ సంస్థలను ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి రూ. 50 వేలు, రెండోసారి రూ. 1 లక్ష జరిమానా విధిస్తారు. పదే పదే తప్పులు చేస్తే లేదా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైతే సదరు సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

Next Story