అంగన్‌వాడీ ఆయాలకు శుభవార్త.. పదోన్నతి మార్గదర్శకాలు ఇవే

అంగన్‌వాడీ హెల్పర్ల (ఆయాల) చిరకాల నిరీక్షణకు తెరదించుతూ మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హెల్పర్లను అంగన్‌వాడీ వర్కర్లుగా పదోన్నతి కల్పించేందుకు...

By -  అంజి
Published on : 14 March 2026 7:07 AM IST

Anganwadi Helper to Worker Promotion, Women and Child Welfare Department Guidelines, Anganwadi Worker Recruitment Rules 2026, Promotion Policy for Anganwadi Helpers, Eligibility for Anganwadi Worker Posts

అంగన్‌వాడీ ఆయాలకు శుభవార్త.. పదోన్నతి మార్గదర్శకాలు ఇవే

అమరావతి: అంగన్‌వాడీ హెల్పర్ల (ఆయాల) చిరకాల నిరీక్షణకు తెరదించుతూ మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హెల్పర్లను అంగన్‌వాడీ వర్కర్లుగా పదోన్నతి కల్పించేందుకు సంబంధించి సవరించిన సరికొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులను భర్తీ చేసే క్రమంలో, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న హెల్పర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

కీలక మార్గదర్శకాలు:

మొత్తం వర్కర్ ఖాళీలలో 50 శాతం పోస్టులను కేవలం అర్హత కలిగిన హెల్పర్ల పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలి. నియామక సంవత్సరం జూలై 1 నాటికి అభ్యర్థి వయస్సు 50 ఏళ్లు మించకూడదు. కనీసం పదో తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే శారీరక దృఢత్వం (ఫిట్‌నెస్) తప్పనిసరి. అంగన్‌వాడీ హెల్పర్‌గా కనీసం ఐదేళ్ల పాటు నిరంతర సేవలు పూర్తి చేసి ఉండాలి. ఒకే గ్రామం లేదా వార్డులో ఒకటి కంటే ఎక్కువ కేంద్రాలు ఉన్నప్పుడు సీనియారిటీని ప్రాధాన్యతగా తీసుకుంటారు.

ఒకవేళ సీనియారిటీ సమానంగా ఉంటే, వయస్సులో పెద్దవారికి లేదా ఎక్కువ విద్యార్హత ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. పదోన్నతుల ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి ఆయాలుగా పనిచేస్తున్న వేలాది మంది మహిళలకు కెరీర్ పరంగా లబ్ధి చేకూరనుంది.

Next Story