నెల్లూరులో సందడి.. రొట్టెల పండగకు ఇంకా 4 రోజులే

Nellore Rottela Pandaga-2022.. Full details here. నెల్లూరులోని బారాషహీద్‌ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగ నిర్వహణకు అధికారులు

By అంజి  Published on  5 Aug 2022 6:05 AM GMT
నెల్లూరులో సందడి.. రొట్టెల పండగకు ఇంకా 4 రోజులే

నెల్లూరులోని బారాషహీద్‌ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి 13 వరకు రొట్టెల పండుగ జరగనుంది. ఈ పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇక దూర ప్రాంతాల నుంచి భక్తులు పండుగ ముందే నెల్లూరు చేరుకుంటున్నారు. దీంతో నాలుగు రోజుల ముందుగానే నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది. భక్తుల ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

గంధ మహోత్సవం ప్రత్యేకత

గంధ మహోత్సవం.. రొట్టెల పండగలో ప్రధాన ఘట్టం. పవిత్ర గంధాన్ని ముజావర్లు దర్గాలోని సమాధులపై లేపనం చేసి.. ఆ తర్వాత ఆ గంధాన్ని స్వర్ణాల చెరువులో కలుపుతారు. అనంతరం చెరువులోని నీటికి మహత్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే స్వర్ణాల చెరువులో భక్తులు స్నానాలు చేస్తారు. అదే సమయంలో స్వర్ణాల చెరువులో నిలబడి రొట్టెలు మార్చుకుంటారు. అనంతరం కోర్కెల రొట్టెలను స్వీకరిస్తారు. పండగు సమయంలో నెల్లూరులో రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఈ పండుగ కోసం తెలంగాణ, ఏపీతో పాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తదితర ప్రాంతాల నుంచి భక్తులు నెల్లూరుకు వస్తున్నారు. కార్లు, మినీ బస్సుల్లో దర్గాకు చేరకుంటున్నారు. భక్తులు అమరవీరుల సమాధులను దర్శించుకుని ఫతెహాలు చేస్తున్నారు. అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలను మార్పిడి చేసుకుంటున్నారు. ''రొట్టెల పండుగ జరిగే దర్గా ప్రాంతంతో పాటూ వాహనాల పార్కింగ్ ప్రదేశాలను 5 సెక్టార్లుగా విభజించాం. నగరంలో 10 డైవర్షన్ పాయింట్స్, 13 మేజర్, 12 మైనర్ పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాం. 14 ట్రాఫిక్ జంక్షన్ పాయింట్లు, 74 సాధారణ ట్రాఫిక్ రెగ్యులేషన్ పాయింట్లను గుర్తించాం. అన్నీ పార్కింగ్ ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు, కంట్రోల్ రూములు, సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రముఖులకు ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేస్తాం'' అని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు.

పండుగకు సమయం దగ్గర పడుతుండటంతో దర్గాను వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో విద్యుత్‌ దీపాలంకరణతో ముస్తాబు చేస్తున్నారు. వాటర్‌ ప్రూఫ్‌ గుడారాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ, పలు శాఖల ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలోకి ప్రవేశించే మూడు మార్గాల నుంచి భక్తుల రాకపోకలు సాగేలా సన్నాహాలు చేపట్టారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల రొట్టెల పండగ సందడి లేదు. కేవలం ముజావర్లు మాత్రమే బారాషహీద్ దర్గాకు వచ్చి గంధ మహోత్సవంలో పాల్గొన్నారు.

Next Story