ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా మాజీ సీఎస్, ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నీ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 31తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం అయ్యింది. అంతకు ముందే నీలం సాహ్నీ నియామకాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో నీలం సాహ్నీ నూతన ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇటీవలే‌ ప్రభుత్వ సలహాదారు పదవికి నీలం సాహ్నీ రాజీనామా చేశారు. ఐదేళ్లపాటు ఎస్‌ఈసీగా నీలంసాహ్ని బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కొత్త ఎస్ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నీలం సాహ్నీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కమిషన్ కార్యదర్శి కన్నబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలిచ్చి ఆమెను అభినందించారు. రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం ముగ్గురి పేర్లను సిఫార్సు చేయగా, వాటిని పరిశీలించిన గవర్నర్, సాహ్నీ నియామకాన్ని ఆమోదించారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహిస్తారని అనుకున్నారు. కొద్దిరోజుల కిందటే నిర్వహించడం లేదని నిమ్మగడ్డ ప్రకటించారు. తన పదవీ కాలం పూర్తవుతుండటంతో బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను షెడ్యూల్ విడుదల చేయలేను అన్నారు. నీలం సాహ్నీ నా తర్వాత ఎస్ఈసీగా రాబోతున్నారు.. సంతోషం..ఎస్ఈసీ విధులు.. బాధ్యతలపై ఆమెతో చర్చించానని నిమ్మగడ్డ అన్నారు. విభజన తర్వాత పటిష్టమైన పునాదులతో ఎస్ఈసీ ఏర్పాటు కావాల్సి ఉందని అన్నారు. బయట వ్యక్తులు ఎస్ఈసీని ప్రభావితం చేసే పరిస్థితి ఉండకూడదని.. ప్రభుత్వం నుంచి కోరుకున్న విధంగా పూర్తి సహకారం లభించిందని తెలిపారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story