శుక్రవారం (మార్చి 20) వార్షిక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిన సందర్భంగా మంత్రి టి.జి. భరత్ మాట్లాడారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిరుద్యోగ యువత కోసం తొలి విడతగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని, ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించి తీరుతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఇందుకోసం కేవలం ప్రభుత్వ రంగమే కాకుండా, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా కూడా ఉపాధి అవకాశాలను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలను ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి భరత్ పేర్కొన్నారు. ప్రభుత్వ నియామకాలతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తామని, తద్వారా నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన వివరించారు.