విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం సమీపంలో అర్ధరాత్రి వేళ ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుండి ఒడిశాలోని మల్కనగిరి వెళ్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో సహా మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, బస్సు డ్రైవర్ దశరథ్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరినీ అప్రమత్తం చేయడంతో తృటిలో ప్రాణనష్టం తప్పింది.
పోలీసుల కథనం ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉండగా, బస్సు టైర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ వెంటనే నిప్పురవ్వలు చెలరేగి బస్సు బాడీకి అంటుకున్నాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేసి, లోపల ఉన్న వారందరినీ హుటాహుటిన కిందకు దించారు. సమాచారం అందుకున్న బొబ్బిలి రూరల్ పోలీసులు, బాడంగి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో ఒక మహిళా ప్రయాణికురాలు తన పది లక్షల రూపాయల విలువైన బంగారు నగలను కంగారులో బస్సులోనే వదిలేశారు. బస్సు పూర్తిగా తగలబడటంతో తన నగలు కూడా పోయాయని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. అయితే, బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని, అగ్నిమాపక చర్యల అనంతరం బస్సు శకలాల్లో వెతికించారు. అదృష్టవశాత్తూ ఆ నగలు సురక్షితంగా దొరకడంతో వాటిని బాధితురాలికి అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.