తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించుకోడానికి ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వరదయ్యపాళెంలో జరిగిన సభలో మాట్లాడుతూ పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు. అయితే ఆమెను గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గుతాయని లోకేష్ అనడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయింది. లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
ఒక ఎంపీ సీట్ గెలిస్తే పెట్రోల్, గ్యాస్ ధరల తగ్గింపునకు సంబంధం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశానికి ఇలా ఒక్క ఎంపీ సీట్ కు లింక్ చేయడం హాస్యాస్పదంగా ఉందని పలువురు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అంటున్నారు. ఇక సత్యవేడులో కూడా నారా లోకేష్ రోడ్ షో నిర్వహించారు. లోకేశ్ ప్రసంగిస్తుండగా అక్కడికి సమీపంలోని మసీదు నుంచి అజాన్ శబ్దం వినిపించింది. దాంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేశారు. కార్యకర్తలు నినాదాలు చేస్తుండడంతో నమాజ్ వినిపిస్తోంది, నిశ్శబ్దంగా ఉండాలని సూచించారు. నమాజ్ పూర్తయ్యేవరకు ఆయన మౌనంగా ఉన్నారు.