సీఎం జగన్ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు: నారా లోకేశ్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాల్లో విమర్శనాస్త్రాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 1:15 PM ISTసీఎం జగన్ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు: నారా లోకేశ్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాల్లో విమర్శనాస్త్రాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోసం ప్రదాన పార్టీలన్నీ సిద్దం అయ్యాయి. ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. ప్రజల్లో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. టీడీపీ, జనసేన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి గట్టిషాక్ ఇవ్వాలని చూస్తున్నారు. తాజాగా విశాఖ నగరం ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
గతంలో విశాఖపట్నం నగరం ప్రశాంతంగా ఉండేదనీ.. కానీ వైసీపీ ప్రభుత్వం విషాదనగరంగా మార్చేసింది నారా లోకేశ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్ అని విమర్శించారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్యనిషేధం అని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు. కొత్త కొత్త బ్రాండ్లతో ప్రజల ప్రాణాల మీదకు తెచ్చారని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలు కూడా వైసీపీ పాలనలో సంతోషంగా లేరని అన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని సీఎం జగన్‌పై నారా లోకేశ్ అన్నారు. ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చిందని.. ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 5 రూపాయలు ఇస్తే పేటీఎం బ్యాచ్ ఏమైనా చేస్తుందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరి పేరూ రెడ్‌బుక్‌లో ఉందనీ.. మన ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటానని నారా లోకేశ్ అన్నారు.