Nara Lokesh : కియా ఎదుట నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్‌

కియా ప‌రిశ్ర‌మ ముందు నారా లోకేశ్ సెల్ఫీ తీసుకున్నారు. అనంత‌రం సెల్ఫీ ఛాలెంజ్‌ను విసిరారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2023 2:00 PM IST
Nara Lokesh, Selfie Challenge

కియా ఎదుట నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్‌

తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర 55వ రోజుకు చేరుకుంది. స‌త్య‌సాయి జిల్లా పెనుకొండ క్రాస్ నుంచి నేటి ఉద‌యం పాద‌యాత్ర‌ను లోకేశ్ ప్రారంభించారు. కియా ప‌రిశ్ర‌మ వ‌ద్ద‌కు పాద‌యాత్ర చేరుకోగానే ఆ ప‌రిశ్ర‌మ ముందు లోకేశ్ సెల్ఫీ తీసుకున్నారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు సెల్ఫీ చాలెంజ్ చేశారు.

మీడియాతో లోకేశ్ మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో చాలా ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయ‌న్నారు. అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి చెప్పుకోవటంలో విఫలమయ్యామని చెప్పారు. ఇది చంద్రబాబు ఘనత అంటూ కియా పరిశ్రమను చూపించారు. ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు. పరోక్షంగా లక్షలాది మందికి కియా ద్వారా లబ్ధి చేకూరింద‌న్నారు.

పాదయాత్రలో తాము తెచ్చిన వందలాది పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి ఛాలెంజ్ చేస్తున్నామన్నారు. 4 ఏళ్లలో తాను తెచ్చిన ఒక్క పరిశ్రమ ముందైనా జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ దిగి చూపగలరా? అని సవాల్ విసిరారు. ప్ర‌జావేదిక కూల్చివేత‌తో వైఎస్ జ‌గ‌న్ ప‌రిపాల‌న ప్రారంభ‌మైంద‌ని, అన్ని ప‌రిశ్ర‌మ‌లు రాష్ట్రం నుంచి వెళ్లిపోవ‌డ‌మే త‌ప్ప కొత్త‌గా ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చిన దాఖ‌లాలు లేవ‌ని విమ‌ర్శించారు.

అభివృద్ధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం దేశంలో నెంబర్1 గా ఎందుకు ఉండకూడదనే సంకల్పంతో తాము పని చేశామని, అయితే.. ఇప్పుడు అరాచకాల్లో ఏపీని నెంబర్1 చేసేందుకు వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు.

"ఇది కియా. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఈ సంస్థ రూ.13,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000 ఉద్యోగాలు కల్పించింది. సంవత్సరానికి 4 లక్షల వాహనాలు తయారు చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇలాంటి కంపెనీని ఏపీకి తీసుకురావడం గురించి మీరు కలలో కూడా ఊహించలేరు వైఎస్ జగన్’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Next Story