మంగళగిరి పర్యటనలో ఉన్న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజులు పాటు 4 వేల కిలోమీటర్లు తన పాదయాత్ర కొనసాగనుందని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో సైతం నాలుగు రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.
పాదయాత్ర నేపథ్యంలో ఏడాది పాటు తాను నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వస్తుందని, ఆ సమయంలో నియోజకవర్గాన్ని కాపాడే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ తనను ఓడించేందుకు సీఎం జగన్ చేసే కుయుక్తులను, వాడే ఆయుధాలను నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు సైనికుల మాదిరిగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలో తనను గెలిపించే బాధ్యతను టీడీపీ నేతలపై పెడుతున్నానని, రాష్ట్రంలో టీడీపీ గెలిపించే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుంటున్నట్లు చెప్పారు. జగన్ ఎన్ని కుయుక్తులు చేసినా ఈ సారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.