చంద్రబాబు భయపడటం లేదు..న్యాయ పోరాటం కొనసాగిస్తాం: లోకేశ్
చంద్రబాబుని ములాఖత్ ద్వారా నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి కలుసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 12:15 PM GMTచంద్రబాబు భయపడటం లేదు..న్యాయ పోరాటం కొనసాగిస్తాం: లోకేశ్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబుని ములాఖత్ ద్వారా ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే జైల్లో ఉన్న సదుపాయాల గురించి కూడా ఆరా తీశారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా తాను బాగానే ఉన్నానని.. అందరూ ధైర్యంగా ఉండాలని.. అలాగే ప్రజలనూ ధైర్యంగా ఉండమని చెప్పాలని కుటుంబ సభ్యులకు చెప్పారు చంద్రబాబు. అలాగే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసుకు సంబంధించిన వివరాలను కూడా చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల నారా లోకేశ్ ఢిల్లీలోనే పర్యటించారు. దానికి సంబంధించిన చర్చ జరిగినట్లు సమాచారం.
ములాఖత్ తర్వాత నారా లోకేశ్ జైలు బయట మీడియాతో మాట్లాడారు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుని రిమాండ్‌కు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై దొంగ కేసు బనాయించారని.. ఇప్పటి వరకు చంద్రబాబు 28 రోజులుగా జైల్లోనే ఉన్నారని అన్నారు. ఏపీ అభివృద్ధి, రావాల్సిన నిధులపై పోరాడాలని అడిగినందుకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారని అన్నారు. ఇసుక, మద్యం , మైనింగ్ మాఫియా గురించి ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టారని ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు ప్రజాసేవలో ఉన్న వ్యక్తి.. ఎప్పుడూ అవినీతి ఎరుగరని అన్నారు. న్యాయం ఆలస్యం కావొచ్చేమో గానీ.. న్యాయం జరగడం మాత్రం తథ్యం అని నారా లోకేశ్ అన్నారు.
చంద్రబాబుని అరెస్ట్ చేశాక తనపై కూడా అనేక ఆరోపణలు చేశారని అన్నారు లోకేశ్. ప్రజలంతా ఆలోచించాలని 1982 నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సేవలు అందించిందని చెప్పారు. అన్యాయం జరిగితే అక్కడ నిలబడి పోరాడతామని చెప్పారు. ఇవాళ చంద్రబాబుకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైందని.. న్యాయం దొరికే వరకూ పోరాడదామని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. కానీ శాంతియుతంగా పోరాడదామని చెప్పారు. కాగా.. చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నా అధైర్యపడటం లేదని.. కొడుకుగా తాను తప్పు చేసినా ముందుగా జైలుకు పంపే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు లోకేశ్. తప్పుడు కేసులకు భయపడమని.. న్యాయపోరాటం కొనసాగుతుందని నారా లోకేశ్ చెప్పారు. అయితే.. శనివారం రాత్రి 7 గంటలకు ఐదు నిమిషాల పాటు 'క్రాంతితో కాంతి' కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని నారా లోకేశ్ కోరారు.