సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని తెలుగుదేశం నేత నారా లోకేష్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ద్విచక్రవాహనంపై వెలుతున్న జంటపై దాడి చేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడడం అమానుషమన్నారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడానికి వెళితే.. పోలీసులు తమ పరిధి కాదని వేరే పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి అని చెప్పడం దారుణమన్నారు. మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని మండిపడ్డారు. ఆడబిడ్డని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెలుతుంటే.. వేల మంది పోలీసులను రంగంలోకి దించారని విమర్శించారు. ప్రభుత్వం.. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్లే ఈ దుస్తితి దాపురించిందని లోకేష్ అన్నారు.
నారా లోకేష్ నరసారావుపేట పర్యటన ఉత్కంఠగా మారింది. ఈ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లోకేష్ హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా.. విమానాశ్రయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలోనికి ఎవ్వరిని అనుమతించడం లేదు. నరసరావుపేట వెళ్లే ప్రధాన మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.