ప్రతిపక్షాల వాహనాలనే తనిఖీ చేస్తారా?: నారా లోకేశ్
ఏపీ పోలీసుల వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 9:30 PM ISTప్రతిపక్షాల వాహనాలనే తనిఖీ చేస్తారా?: నారా లోకేశ్
ఏపీ పోలీసుల వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీలోనే కాదు దేశం మొత్తం ఎన్నికల కోడ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో నగదు తరలిస్తుంటే దానిని సీజ్ చేస్తున్నారు. ఇది ఎన్నికల కోడ్ నిబంధనల్లో భాగమే. అయితే.. ఏపీలో పోలీసుల వ్యవహారం ఏ మాత్రం సరిగ్గా లేదని నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.
ప్రతిపక్షాల వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని పోలీసులు తనిఖీలు చేస్తున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. పైనుంచి ఆదేశాలు రావడంతోనే ప్రతిపక్షాల వాహనాలను మాత్రమే తనిఖీ చేస్తున్నారని కింది సిబ్బంది చెబుతున్నారంటూ మండిపడ్డారు. పార్టీ అంతర్గత సమావేశంలో ఇంటెలిజెన్స్‌కు ఏం పని అంటూ అధికార పార్టీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీపైనా కూడా ఆయన మండిపడ్డారు. డీజీపీకి టైమ్ దగ్గరపడిందని వార్నింగ్ ఇచ్చారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీని సస్పెండ్ చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వారు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. చర్యలు తీసుకునే వరకు పోరాడతామని నారా లోకేశ్ అన్నారు.
గుంటూరు ఎస్పీ కూడా టీడీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారనీ.. టీడీపీ వారిని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నారని లోకేశ్ ఫైర్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీల వాహనాలు పోలీసులకు ఎందుకు కనిపించవని ప్రశ్నించారు. మంగళగిరి మొత్తం డ్రగ్స్ డెన్‌గా మారిందని ఆరోపించారు. పోలీసులకు ఇవన్నీ కనిపించదా అంటూ నారా లోకేశ్ నిలదీశారు.