ఓడిన చోటే మళ్లీ పోటీ చేసి గెలుస్తా: నారా లోకేశ్
ఓడిపోయిన చోటే మళ్లీ పోటీ చేసి గెలవాలని లోకేశ్ భావిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 4:16 PM ISTఓడిన చోటే మళ్లీ పోటీ చేసి గెలుస్తా: నారా లోకేశ్
ఓడిపోయిన చోటే మళ్లీ పోటీ చేసి గెలవాలని లోకేశ్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బరిలోకి దిగి.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిని చవిచూశాడు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోనే చంద్రబాబు తనయుడు ఓడిపోవడంతో టీడీపీ జీర్ణించుకోలేకపోయింది. అయితే ఈ సారి కూడా నారా లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేసి.. గెలిచి తీరుతానని దీమా వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంగా.. ఈసారి సేఫ్‌గా ఉన్న అసెంబ్లీ స్థానం నుంచి లోకేశ్‌ను పోటీ చేయించాలి టీడీపీ భావించింది. కానీ.. అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు నారా లోకేశ్. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని.. మంగళగిరి నుంచే పోటీ చేసి గెలుస్తానని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ సీటుని గెలిచి టీడీపీ గిఫ్ట్‌గా ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే.. మంగళగిరి అసెంబ్లీ స్థానంలో టీడీపీకి అంత బలం లేదు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, వైసీపీకే పట్టు ఉంది. చేనేతలే గెలుపోటములను నిర్ణయించేలా ప్రభావితం చేస్తారు. అందుకే అక్కడి చేనేత నాయకులను జగన్ వైసీపీలో చేర్చుకున్నారు. కొందరికి పదవులను కూడా కట్టబెట్టారు. దాంతో.. మూడోసారి కూడా మంగళగిరిలో జెండా ఎగరేయొచ్చని భావిస్తున్నారు.
నారా లోకేశ్ మాత్రం వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని.. అదే తనని గెలిపిస్తుందని చెబుతున్నారు. రాజధాని మార్పు అంశం కూడా తనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి, ప్రజలకు అందరికీ తాను న్యాయం చేస్తానని భరోసా ఇస్తున్నారు. మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్‌లో వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లిన లోకేశ్.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని దీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అవ్వుతారని అన్నారు. చంద్రబాబుకి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. మరో 6 నెలల్లో కరకట్ట కమల్‌హాసన్‌ను ఇంటికి పంపించడం ఖామయని లోకేశ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలుపట్టడం లేదని.. తాను ఓడినా కూడా ప్రజలకు అండగా నిలబడ్డానని లోకేశ్ చెప్పుకొచ్చారు.