నారావారిపల్లి నుంచే నారా భువనేశ్వరి బస్సు యాత్ర
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లనున్నారు. నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 4:15 PM ISTనారావారిపల్లి నుంచే నారా భువనేశ్వరి బస్సు యాత్ర
ఏపీ స్కిల్ డెవల్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు నెలన్నర రోజులు గడుస్తున్నాయి. అయితే.. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని.. ఆయనకు స్కిల్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నాయకులు, నారా కుటుంబ సభ్యులు చెబుతూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వమే కుట్ర పన్ని అక్రమంగా చంద్రబాబుని అరెస్ట్ చేయించి.. జైలు నుంచి బయటకు రాకుండా చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే చంద్రబాబుకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు. నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నారు. ఈ మేరకు నారా భువనేశ్వరి బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లి నుంచి ఆమె బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లాలోనే నారా భువనేశ్వరి మూడ్రోజుల పాటు పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. మంగళవారం తిరుపతిలోనే ఆమె బస చేస్తారు. ఆ తర్వాత బుధవారం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లికి చేరకుంటున్నారు. అక్కడి నుంచే నిజం గెలవాలి పేరిట టీడీపీ బస్సు యాత్రకు శ్రీకారం చుడతారు. మంగళవారం రాత్రి నారావారిపల్లిలోనే నారా భువనేశ్వరి ఉంటారు. ఆతర్వాత తిరుపతి జిల్లాలో ఆమె పర్యటిస్తారని టీడీపీ నాయకులు వెల్లడించారు. కాగా.. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఈ నెల 26న నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఆ తర్వాత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై తిరుపతిలో జరిగే బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొని ప్రసంగించనున్నారు.
తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు భారీ సంఖ్యలో జనాలను తీసుకొచ్చేలా సన్నద్ధం చేస్తున్నారు. బహిరంగ సభ వేదికగా వైసీపీ ప్రభుత్వం తీరుని నారా భువనేశ్వరి ఎండగడతారని.. చంద్రబాబుని ఎలా అక్రమంగా అరెస్ట్ చేశారో ప్రజలకు వివరిస్తారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.