కృష్ణా జిల్లా నిమ్మకూరులో నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) విగ్రహానికి ఆయన తనయుడు, నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వచ్చిన బాలయ్య.. వేంకటేశ్వరస్వామి ఆలయ్యంలో ప్రత్యేక పూజలు చేశారు. బాలయ్య రాకతో నిమ్మకూరులో సందడి వాతావరణం నెలకొంది.
అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిలో నిలిచిపోయారని అన్నారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు. ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఉంటాయన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు వాడిగా పుట్టాలని నినదించిన ఆయనకు వందనాలని బాలయ్య చెప్పారు. ఎన్టీఆర్ జన్మభూమి నిమ్మకూరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 35 అడుగుల విగ్రహాం ఏర్పాటుకు అంతా తీర్మానించినట్లు బాలయ్య తెలిపారు.
ఇక యువకులు రాజకీయాల్లోకి రావాలని బాలయ్య కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారన్నారు. రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో మాట్లాడుతానని బాలయ్య చెప్పారు.