భోగి సంబరాలు.. కారంచేడులో బాలయ్య
Nandamuri Balakrishna celebrated Bbhogi festival at Karamchedu.తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 14 Jan 2022 9:27 AM ISTతెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంటలు వేసి, చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భోగి సంబురాల్లో పాల్గొన్నారు. ఇక ప్రకాశం జిల్లా కారంచేడులో సినీ హీరో, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో జరిగిన భోగి సంబురాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులతో కలసి సందడి చేశారు. లోకేశ్వరి, ఉమామహేశ్వరి ఇలా నందమూరి కుటుంబ సభ్యులంతా ఓ చోట చేరడంతో అసలైన పండుగ వాతావరణం కనిపించింది. భోగి వేడుకల్లో పాల్గొనేందుకు గురువారమే బాలకృష్ణ దంపతులు కారంచేడుకు చేరుకున్నారు. బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా కారంచేడుకు వచ్చారు.
బాలకృష్ణ వచ్చిన విషయం తెలిసి గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. కాగా.. కరోనా నేపథ్యంలో ఎవరినీ లోపలికి అనుమతించలేదు. గేటు బయట ఉన్నవారితో బాలయ్య కాసేపు మాట్లాడారు. ఇక బాలకృష్ణ తన చిన్నతనంలో ఎక్కువ భాగం కారంచేడులోనే గడిపారని.. సెలవుల్లో ఎక్కువగా ఇక్కడే ఉండేవారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఓ సందర్భంలో తెలిపిన విషయం తెలిసిందే.