పశ్చిమ గోదావరిలో అంతుచిక్కని వ్యాధి కలకలం.. ఆందోళనలో ప్రజలు
Mysterious disease in Denduluru.పశ్చిమగోదావరి జిల్లాను అంతుచిక్కని వ్యాధి వెంటాడుతోంది. ఇటీవలే ఏలూరులో
By తోట వంశీ కుమార్ Published on 22 Jan 2021 5:44 AM GMTపశ్చిమగోదావరి జిల్లాను అంతుచిక్కని వ్యాధి వెంటాడుతోంది. ఇటీవలే ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అనేక మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి కళ్ళుతిరిగి పడిపోవడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నీటిలో రసాయనాలు కలవడమే ఇందుకు కారణమని అప్పట్లో వైద్యులు నిర్ధారించారు. కాగా.. తాజాగా దెందులూరు మండలం కోమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టించింది. స్థానికులు ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఇప్పటి వరకు 24 మంది అస్వస్థతకు గురికాగా.. బాధితులను ఏలూరు, గుండుగొలనులోని హాస్పిటలకు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్న అనంతరం ఆరుగురు బాధితులు ఇంటికి చేరుకున్నారు.
సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి సునంద ఇతర అధికారులు హుటాహుటిన గ్రామానికి తరలివచ్చారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. అయితే ఏలూరు, పూళ్ల తరహాలో వింత వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామంలో ఇప్పటి వరకు 36 మంది మిస్టరీ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా బత్తిన బుల్లబ్బాయ్ అనే వ్యక్తి చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. వింత వ్యాధికి, సదరు వ్యక్తి మృతికి సంబంధం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. సమస్యకు సరైన కారణాలు తెలియక గోదావరి జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు.