జగన్‌ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెడదాం: ముద్రగడ బహిరంగ లేఖ
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 March 2024 5:42 AM GMTజగన్‌ను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెడదాం: ముద్రగడ బహిరంగ లేఖ
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తాను వైసీపీ లో చేరబోతున్నట్లు ఆయన చెప్పారు. అయితే.. తాజాగా రాష్ట్ర ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు.
ఈ మేరకు బహిరంగ లేఖ రాసిన ముద్రగడ.. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను మరోసారి సీఎం కుర్చీలో కూర్చోబెడదామని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని ఆయన అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆశీస్సులు తనకు ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. జగన్‌ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తానని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి కోరికలు లేకుండానే వైసీపీ పార్టీ విజయం కోసం పనిచేయాలని అనుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
సీఎం జగన్ ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ముద్రగడ పద్మనాభం అన్నారు. ప్రజలకు సీఎం జగన్ మరింత సంక్షేమం, అభివృద్ది చేయాలనే ఆశతో ఉన్నారని ముద్రగడ చెప్పారు. మీ బిడ్డగా తానెప్పుడు తప్పు చేయలేదనీ.. ఇక ముందు కూడా చేయను అని చెప్పారు. మార్చి 14వ తేదీన వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్తాననీ.. అక్కడ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లే ప్రయాణంలో ప్రజలు కూడా పాలుపంచుకోవాలని కోరుతున్నానని అన్నారు. అయితే.. ఇక్కడ ప్రజలకు ఒక విన్నపం చేశారు ముద్రగడ. ప్రయాణంలో భాగస్వామ్యం అవ్వాలనుకునే వారు కావాల్సిన ఆహారం, ఇతర అవసరాలు తమతమ వాహనాల్లోనే తెచ్చుకోవాలంటూ ముద్రగడ పద్మనాభం విజ్ఞప్తి చేశారు.
అమరావతి వెళ్లే రూట్‌మ్యాప్‌ను కూడా ముద్రగడ పద్మనాభం బహిరంగ లఖలో తెలిపారు. కిర్లంపూడిలో బయల్దేరి ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా విజయవాడ అక్కడి నుంచి తాడేపల్లి చేరుకోనున్నట్లు ముద్రగడ వెల్లడించారు.