విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత కాశీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. తన అనుచరులతో కలిసి ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు విజ‌య‌సాయి రెడ్డి. కాశీ విశ్వనాథ్ కి విశాఖలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉంది. ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ గెలుపులో ఆయన కీలకంగా వ్యవహరించారు. అలాంటి నేత వైసీపీలో చేరనుండటం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కాశీ విశ్వ‌నాథ్ వైసీపీలో చేరిక సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేరారు. జ‌గ‌న్ పాల‌న చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నార‌ని చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాస‌రావు త‌మ‌కు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు పంపార‌ని.. సీఎం జ‌గ‌న్ ఆమోదం త‌రువాత గంటా శ్రీనివాస్ పార్టీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. అయితే.. గంటా శ్రీనివాస్ చేరిక ప్ర‌తిపాద‌న‌ను మొద‌టి నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ వ్య‌తిరేకిస్తున్నారు. వైసీపీలో కాశీ విశ్వ‌నాథ్ చేరిక కార్య‌క్ర‌మానికి మంత్రి అవంతి శ్రీనివాస్ దూరంగానే ఉన్నారు. దీంతో విశాఖ‌లో వైసీపీలో వ‌ర్గ‌పోరు మొద‌లైంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కాగా.. వైసీపీలో గంటా శ్రీనివాస‌రావు చేర‌తార‌ని కొన్ని నెల‌లుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే.


తోట‌ వంశీ కుమార్‌

Next Story