సుప్రీం కోర్టు ఇటీవల నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రఘురామ ఆరోగ్యం కోలుకోవడంతో.. ఆయన్ను డాక్టర్లు డిశ్చార్జి చేశారు. డిశ్చార్జి అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఎంపీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు. తొలుత గుంటూరు జిల్లా జైలు తరలించారు. అయితే.. తనను సీఐడీ పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారని పేర్కొంటూ ఎంపీ నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించి.. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎంపీని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ముగ్గురు డాక్టర్లలతో కూడిన బృందం ఆయన్ను పరీక్షించింది. ఆ తరువాత బెయిల్, వైద్య పరీక్షల నివేదికలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనంతరం ఆయనకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు చెల్లించాలని.. అలాగే కేసు గురించి మీడియాతోగానీ, సోషల్ మీడియాలో గానీ మాట్లాడవద్దని షరతు విధించింది.