వైసీపీకి రాజీనామా చేసిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  24 Feb 2024 10:05 AM IST
mp raghu rama krishnam raju, resign,  ycp, andhra pradesh,

వైసీపీకి రాజీనామా చేసిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు పార్టీలు మారుతూ ఉన్నారు. ఇంకా రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారపార్టీ వైసీపీకి ఎన్నికల వేళ షాక్‌ ఎదురైంది. ఎట్టకేలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా సీఎం జగన్‌కు రఘురామ వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఆయన కామెంట్స్‌ ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉండేవి. రెబల్‌ ఎంపీగా కొనసాగుతూ వైసీపీపైనే విమర్శలు చేసేవారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.

2019లో వైసీపీలో చేరిన రఘురామకృష్ణంరాజు.. ఆ పార్టీ తరఫున నరసాపురం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే.. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సొంత పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వచ్చారు. సీఎం జగన్‌ సర్కార్‌కు దూరంగా ఉన్న రఘురామకృష్ణంరాజు శనివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పూర్తిగా పార్టీకి దూరం అయ్యారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాసిన ఆయన.. దానిని సీఎం జగన్‌కు పంపించారు. ఆ లేఖను ఎక్స్‌ వేదిక ద్వారా షేర్‌ చేశారు. అయితే.. ఎన్నికల నేపథ్యంలో త్వరలోనే రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. నరసాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశాలూ ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఆయన టీడీపీ పార్టీలో చేరుతారా? లేదా స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తారా? ఒక వేళ టీడీపీలో చేరాలనుకుంటే ఆ పార్టీ ఎలా స్పందిస్తుంది? చేర్చుకుంటే నర్సాపురం టికెట్‌ను కేటాయిస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి.


Next Story