రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
రోడ్డుప్రమాదంలో ఏపీకి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 9:17 AM GMTరోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
రోడ్డుప్రమాదంలో ఏపీకి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ దగ్గర ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారు, ఎదురుగా వస్తోన్న మరోకారు ఢీకొన్నాయి.. దాంతో.. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రాణాలు కోల్పోయారు.
భీమవరంలో జరుగుతున్న అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు ఏలూరు నుంచి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ కారులో బయల్దేరారు. ఆ తర్వాత భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారు, ఎమ్మెల్సీ కారు రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్. గన్‌మెన్, ఆయన పీఏకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే.. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనం వెంటనే అక్కడికి చేరుకుంది. గాయపడ్డవారిని భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఘటనాస్థలిని ఉండి ఏఎస్‌ఐ సూర్యనారాయణ, ఎంపీడీవో కొండలరావుతో పాటు ఇతర అధికారులు పరిశీలించారు
షేక్ సాబ్జీ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు. ఈ మేరకు షేక్ సాబ్జీ మృతి పట్ల కేబినెట్ సైతం సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డుప్రమాదంలో మరణించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇది అత్యంత విషాదకర సంఘటన అన్నారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం విచారకరమని చంద్రబాబు అన్నారు. చివరి ఘడియల్లో కూడా ప్రజాసేవలోనే ఉన్న షేక్ సాబ్జి మృతిపట్ల చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సాబ్జి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.