ఎన్నికల లెక్కలలో.. ఈ ఎమ్మెల్సీ లెక్కలు వేరయా..!

MLC Ashok Babu About Local Body Election. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం ఆరు గంటల వరకు వెలువడిన ఫలితాల్లో..

By Medi Samrat  Published on  22 Feb 2021 2:12 PM IST
MLC Ashok Babu

నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం ఆరు గంటల వరకు వెలువడిన ఫలితాల్లో.. తాము బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్ధులు 1119 చోట్ల గెలుపొందినట్లు తెలుగుదేశం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలో 111 మంది, విజయనగరంలో 104, విశాఖ 51 మంది గెలుపొందినట్లు వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో 98, పశ్చిమ గోదావరిలో 103, కృష్ణలో 88, గుంటూరులో 93 మంది, ప్రకాశం జిల్లాలో 76, నెల్లూరులో 60 మంది సర్పంచ్‌లుగా ఎన్నికైనట్లు ప్రకటించింది. రాయలసీమ జిల్లాల్లో కడపలో 81, కర్నూలులో 82, అనంతపురంలో 79, చిత్తూరులో 93 చోట్లు టిడిపి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినట్లు స్పష్టం చేసింది.

ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న కొంతమంది పోలీసులు, సిబ్బంది వైసిపికి అనుకూలంగా ఫలితాలు మారుస్తున్నారని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి టిడిపి అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారులందరూ సత్వరమే ఫలితాలను ప్రకటించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

రాజధాని పరిధిలోని గ్రామాలైన వైకుంఠపురం, వేల్పూరు, పెదకూరపాడులో టిడిపి అభ్యర్థులు గెలిచినప్పటికీ.. ప్రకటించకుండా వైసిపి గెలుపు కోసం అధికార యంత్రాంగం ఆరాటపడుతోందని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. రాజధాని గ్రామాల్లో తెలుగుదేశం గెలవకూడదనే వైసిపి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వైసిపి నేతల అరాచకాలపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసినా.. క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు ప్రభుత్వానికే కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. స్మ‌శానంలో దయ్యాల్లా వైసిపి నేతలు అర్థరాత్రి తిరుగుతూ ప్రజలను భయపెట్టి.. గెలుపును సొంతం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.


Next Story