తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. చంద్రబాబు సతీమణికి క్షమాపణలు చెప్పారు. తాను అలా మాట్లాడి ఉండకూడదని, పొరపాటున ఓ మాట దొర్లానన్నారు. అలా మాట్లాడడం తప్పేనని.. ఎవరు అలా మాట్లాడినా తప్పేనన్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
తెలుగుదేశం పార్టీలో అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరినే అని.. ఆమెను అక్కా అని పిలిచేవాడినని చెప్పుకొచ్చారు. ఆమెతో పాటు తన మాటల వల్ల బాధపడిన వారందరికి క్షమాపణలు చెబుతున్నట్లు వంశీ తెలిపారు. కులం నుంచి వెలివేస్తారనే భయంతో తాను క్షమాపణ చెప్పడం లేదని, వ్యక్తిగతంగా బాధపడుతున్నందునే మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. ఈ వివాదంలో అందరూ సంయమనం పాటించాలన్నారు.