నన్ను మూడేళ్లు వాడుకున్నారు.. వైసీపీకి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా: ఎమ్మెల్యే శ్రీదేవి

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను అమ్ముడుపోయినట్లు ఆరోపణలు చేస్తున్న వారికి త్వరలోనే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని ఎమ్మెల్యే ఉండవల్లి

By అంజి  Published on  26 March 2023 8:45 AM GMT
MLA Undavalli Sridevi , CM Jagan, YCP

వైసీపీకి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా: ఎమ్మెల్యే శ్రీదేవి

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను అమ్ముడుపోయినట్లు ఆరోపణలు చేస్తున్న వారికి త్వరలోనే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ పాల్పడ్డారనే ఆరోపణలపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ సస్పెండ్‌ చేసింది. దీన్ని ఆదివారం నాడు శ్రీదేవి తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్‌సీపీ గూండాలతో తనకు ప్రాణహాని ఉందని అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళిత శాసనసభ్యురాలిగా ఉన్నందుకు తనను దూషించారని, తన కుటుంబానికి జీవితంలో అతిపెద్ద షాక్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అతని వైసీపీకి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు.

వైఎస్ జగన్‌ను మంచి మనసున్న వ్యక్తి అని, విలువలు, నైతికత ఉన్న వ్యక్తి అని పేర్కొంటూనే.. ఆయన చుట్టూ ఉన్న కోటరీ తనపై 'స్లో పాయిజన్'లా తన మనసును కలుషితం చేసిందని నిందించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే శ్రీదేవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సజ్జల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు ఏదైనా జరిగితే అతడే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో విచక్షణా రహితంగా ఇసుక తవ్వకాలతో పాటు తమ అక్రమ కార్యకలాపాలకు తాను బినామీగా లేనని, అందుకే తనను పార్టీ నుంచి దూరం చేసేందుకు వైఎస్సార్సీపీ వ్యక్తులు చేసిన లోతైన కుట్రలో తన సస్పెన్షన్ ఒక భాగమని ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

దళిత మహిళా శాసనసభ్యురాలికి ఇలాగే వ్యవహరిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేశారా అనే అంశంపై శ్రీదేవి మాట్లాడుతూ.. ''నేను రహస్య ఓటింగ్‌లో ఓటు వేసేటప్పుడు ఎవరైనా టేబుల్ కింద కూర్చున్నారా? వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి నేను డబ్బు తీసుకున్నట్లు వారు నిరూపించగలరా? అమరావతి గడ్డపై ప్రమాణం చేయడానికి, కాణిపాకం గణపతి దేవాలయంతో పాటు ఏ గుడిలోనైనా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను వైఎస్సార్‌సీపీ వ్యక్తులను సవాలు చేస్తున్నాను.. వారు కూడా అదే చేయగలరా? ఎమ్మెల్సీ అనేది మితమైన ప్రయోజనాలతో కూడిన నామినేటెడ్ పోస్ట్. ఇంత చిన్న స్థానాన్ని గెలుచుకున్నందుకు మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఎవరైనా భారీ మొత్తాలను అందించగలరా?'' అంటూ శ్రీదేవి ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో దళితులపై విచక్షణారహితంగా దాడులు జరిగాయని ఆరోపిస్తూ.. తనపై, తన కార్యాలయంపై జరుగుతున్న భౌతిక, సామాజిక మాధ్యమాల దాడులపై జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు. ''గత మూడేళ్లుగా నన్ను వాడుకున్నారు. ఇసుక రీచ్‌లను లాక్కొని సహజ సంపదను దోచుకుంటున్నారు. ఉద్దండరాయునిపాలెంలో ఇసుక రీచ్‌లు ఎవరివి? వారి దౌర్జన్యాలకు నేను అడ్డుగా ఉంటానని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు భయపడి నన్ను తాడికొండ నుంచి గెంటేయాలని ప్రచారం ప్రారంభించారు. ఈ ప్లాన్ మొదటి రోజు నుంచే మొదలైంది'' అని సస్పెండ్ అయిన ఎమ్మెల్యే తెలిపారు.

అమరావతి రాజధాని కోసం పోరాడతానని ప్రతిజ్ఞ చేసిన శ్రీదేవి 2019లో అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని అందరికీ భరోసా ఇచ్చేందుకే ప్రచారం చేశానన్నారు. కానీ ఇప్పుడు రాజధాని ప్రాంతంలోని మహిళలు తమ ఎడతెగని ప్రచారాన్ని ఎంతో శ్రమకోర్చి నిర్వహిస్తుండడం చూసి ఆమె అంతర్గతంగా నిస్సహాయ స్థితిలో ఉంది. జగనన్న కాలనీలు పెద్ద కుంభకోణమని, దాని ముసుగులో వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆమె ఆరోపించారు.

తాడికొండ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని, దివంగత నేత తనయుడు చేస్తున్న పాలనలో విలువలు లేవన్నారు. ''నా భర్త, నాకు రెండు ఆసుపత్రులు ఉన్నాయి. నేను విజయవంతమైన గైనకాలజిస్ట్‌ని, హైదరాబాద్‌లోని టాప్ 10లో ఒకరిని. సమాజానికి పెద్దపీట వేయాలని వైఎస్‌ జగన్‌, మా నాన్న ఉండవల్లి సుబ్బారావుల అభ్యర్థన మేరకు రాజకీయ రంగప్రవేశం చేశాను. అయితే వైద్యరంగంలో కాకుండా రాజకీయాల ద్వారా మెరుగైన సేవలందించగలననే భ్రమలో ఉన్నానని ఇప్పుడు అర్థమైంది'' అని ఆమె అన్నారు.

అమరావతి కోసం ప్రాణత్యాగం చేసైనా పోరాడతానని ఆమె అన్నారు. తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే ప్రశ్నకు ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా తన సేవలను ఉపయోగించుకుని వైఎస్ జగన్, వైఎస్‌ఆర్‌సిపి ద్రోహం చేసిన తాను, తన కుటుంబం షాక్‌లో ఉందని అన్నారు. ఆమె తన మాజీ పార్టీకి అతి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శపథం చేశారు. అయితే ఆమె ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ సంబంధాలలోకి వెళ్లేందుకు నిరాకరించారు. తాను ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నానని, తనను ఏ రాజకీయ పార్టీతో ట్యాగ్ చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. అమరావతి రైతులకు తన సంఘీభావాన్ని పునరుద్ఘాటిస్తూనే, రాజధాని ప్రాంత మహిళా కార్యకర్తలు, జేఏసీ సభ్యులు తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story