నిమ్మల సైకిల్ యాత్రలో అపశృతి.. సైకిల్ పైనుంచి పడిపోయిన ఎమ్మెల్యే
MLA Nimmala Ramanaidu fell down from the cycle.టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు
By తోట వంశీ కుమార్ Published on 5 March 2022 9:48 AMటీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్రలో అపశృతి దొర్లింది. సైకిల్ పై నుంచి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కిందపడ్డారు. అప్రమత్తమైన కార్యకర్తలు వెంటనే ఆయన్ను పైకి లేపారు. ఆయన ఎడమ కాలికి స్వల్పగాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్మల తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ ఘటన దెందులూరు మండలం శింగవరం దగ్గర జరిగింది.
టిడ్కో ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌తో పాలకొల్లు నుంచి అమరావతిలోని అసెంబ్లీకి ఎమ్మెల్యే సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల ఆవేదనను తెలియజేసేందుకు, ఈ సమస్యను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించేందుకు ఈ యాత్ర చేపట్టారు. సైకిల్ యాత్ర దెందులూరు మండలంలోకి ప్రవేశించిన తరువాత శింగవరం వద్ద రామనాయుడు పట్టుతప్పి పడిపోయారు. కొంత సేపు విశ్రాంతి అనంతరం గాయాన్ని లెక్క చేయకుండా సైకిల్ యాత్ర కొనసాగిస్తుండడం గమనార్హం.
తమ ప్రభుత్వంలో 90 శాతం టిడ్కో ఇళ్లను పూర్తి చేశామని.. మరో 10శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేకపోతుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామని ఆనాడు పాదయాత్రలో చెప్పిన జగన్ ఈరోజు బ్యాంకు ఋణాల పేరు చెప్పి అమ్ముకొంటున్నారని ఆరోపించారు. కార్యాలయాలు, ఇళ్లకు రంగులు వేయడంపై ఉన్న ప్రేమ.. పేదల ఇళ్లు పూర్తి చేయడం పై లేదన్నారు. ఈ సైకిల్ యాత్రతోనైనా జగన్‌మోహన్ రెడ్డి కి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.