నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలిచారు. తన వాహనంలో ప్రతినిధిని పంపి చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలా చూశారు. డాక్టర్లతో స్వయంగా మాట్లాడి చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ విజయవంతం కావడంతో చిన్నారి కోలుకోవడంతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు చిన్నారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
'గడప గడపకు - మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఉప్పటూరు విలేజ్‌లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పర్యటించారు. ప్రజలను కలుస్తూ వారి సమస్యలను వింటూ వచ్చాడు. అదే సమయంలో గిరిజన కుటుంబానికి చెందిన పొట్లూరి స్నేహ అనే చిన్నారి హార్ట్ హోల్‌తో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకి తెలిసింది. వెంటనే చిన్నారి ఇంటి దగ్గరికి వెళ్లి తల్లిదండ్రులను ఆరా తీశారు. చిన్నారి సమస్య గురించి చెబుతూ తల్లిదండ్రులు వారి గోడును చెప్పుకోవడంతో ఎమ్మెల్యే చలించిపోయారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. తన కారు ఏర్పాటు చేసి వారి వెంట తన ప్రతినిధిని తిరుపతిలోని ఆస్ప్రతకి పంపించారు. చిన్నారి ఆపరేషన్ గురించి కోటంరెడ్డి స్వయంగా అక్కడి డాక్టర్లతో మాట్లాడారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద చిన్నారి పొట్లూరి స్నేహకు వైద్యులు సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో చిన్నారి కోలుకున్నది.ఆపరేషన్ అనంతరం కోలుకున్న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి మంగళవారం వచ్చింది. తన అండగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్నేహ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.