హిందూపురం అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ
గత ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన కొనసాగిందని ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 5:16 PM ISTహిందూపురం అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ
హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, నటడు నందమూరి బాలకృష్ణ 64 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని నందమూరి బాలకృష్ణ పునఃప్రారంభించారు. అనంతరం స్థానరిక జేవీఎస్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.
గత ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన కొనసాగిందని ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఏకంగా 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయితే.. ప్రజలు వైసీపీకి సరైన బుద్ది చెప్పారనీ.. టీడీపీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఒకేతీర్పు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. హిందూపురానికి పరిశ్రమలు, రింగ్ రోడ్డు, హందినీవా ద్వారా అన్ని చెరువులకు నీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా పురోగమిస్తుందని బాలకృష్ణ అన్నారు.
ఇక లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ పునఃప్రారంభిస్తామని ఆయన అన్నారు. అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. గతంలో రోడ్లు దిబ్బతిన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. రవాణ వ్యవస్థ బాగోలేకపోతే.. అభివృద్ధి కూడా వెనుకబడిపోతుందని చెప్పారు. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. ఇక హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని తనకు అందించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.