వేతన సవరణ- పీఆర్‌సీపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రేపు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీస్ ఇవ్వాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ-జాక్ నిర్ణయించింది. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఉద్యోగసంఘాలు చెబుతున్న క్రమంలో పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగ సంఘ నేతలకు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించారు. సమ్మె నోటీసు ఇవ్వొద్దని.. సామరస్య పూర్వకంగా ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని మంత్రులు కోరారు. కాగా.. ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే.. విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, రాష్ట్ర సచివాలయం ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సమావేశమయ్యారు. పీఆర్సీ జీవోలు రద్దు, ఇతర సమస్యలపై చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఉద్యోగ సంఘాలు రేపు రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి.