కుప్పంలా లేదు.. పులివెందుల లా ఉంది : రోజా

Minister Roja comments on CM Jagan Kuppam tour.సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కుప్పం ప‌ట్ట‌ణం మొత్తం వైసీపీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sep 2022 6:56 AM GMT
కుప్పంలా లేదు.. పులివెందుల లా ఉంది : రోజా

సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కుప్పం ప‌ట్ట‌ణం మొత్తం వైసీపీ శ్రేణుల‌తో నిండిపోయింది. ఎటుచూసినా వైసీపీ జెండాలు, జ‌గ‌న్ ఫ్లెక్సీలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది కుప్పంలా లేదని.. పులివెందులలా ఉందని చెప్పారు. కుప్పం నుంచి కురుపాం వ‌ర‌కు.. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు ఎగిరేది వైసీపీ జెండానేన‌న్న ధీమా వ్య‌క్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ వీధివీధి తిరిగినా మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం ప్రజలు వైసీపీనే గెలిపించారన్నారు. చంద్ర‌బాబు 30 ఏళ్ల‌లో చేయ‌లేని అభివృద్దిని జ‌గ‌న్ మూడేళ్ల‌ల‌లోనే చేసి చూపించార‌న్నారు. వైయస్సార్ చేయూత పథకం ద్వారా మహిళల జీవితాల్లో జగన్ వెలుగులు నింపారని కొనియాడారు.


వైయస్సార్ చేయూత పథకం..

పేద అక్క‌చెల్లెమ్మ‌ల ఆర్థిక స్వావ‌లంబ‌న, సాధికార‌తే ల‌క్ష్యంగా వైఎస్సార్ చేయూత ప‌థ‌కానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ చేయూత కింద సాయాన్ని అందజేస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత పథకం కింద కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా అకౌంట్‌లలో జమ చేయనున్నారు. రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా అందించిన నిధులతో మహిళలు చిన్న వ్యాపారాలు, ఇతర అవసరాలకు, ఉపాధి కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు.

Next Story
Share it