హీరోలకు మంత్రి పేర్ని నాని కౌంటర్
Minister Perni Nani Counter to Actors Nani and Siddarth.చిత్రపరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని
By తోట వంశీ కుమార్ Published on 28 Dec 2021 5:41 PM ISTచిత్రపరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు. సినిమా టికెట్ల అంశంపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని చెప్పారు. థియేటర్ల వర్గీకరణ, ధరలను ఆ కమిటీ నిర్థారిస్తుందన్నారు. అమరావతిలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి సమావేశం అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ భేటి కొనసాగింది. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం కోసమే కమిటీ వేసినట్లు చెప్పారు.
ఆ కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. సినిమా టికెట్ ధరలపై డిస్ట్రిబ్యూటర్లు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారన్నారు. కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లో అత్యధికంగా రూ.150, లోయర్ క్లాస్‌లో రూ.50 ఉండాలని, ఇతర ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో అత్యధికంగా రూ.100, లోయర్ క్లాస్‌లో రూ.40 ఉండాలని వారు కోరినట్లు చెప్పారు. సినీ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులన్ని పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఎవరి మీద కోపం లేదన్నారు. ధరలు రివ్యూ చేయడానికి కమిటీ వేశారని.. అభ్యంతరాలు ఉంటే కమిటీ దృష్టికి తీసుకురావచ్చునని వెల్లడించారు. ఇక గతంలో బాలకృష్ణ సినిమాకు మినహాయింపు ఇచ్చి చిరంజీవి సినిమాకు ఇవ్వలేదన్నారు. జగన్‌కు మాత్రం అలాంటి రాగద్వేషాలు ఉండవు అని మంత్రి పేర్ని నాని చెప్పారు.
ఇక థియేటర్ల యజమానులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. వారు తెలిసి మాట్లాడుతున్నారో తెలియ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కొన్ని థియేటర్లలో కనీస ప్రమాణాలు పాటించడం లేదన్నారు. రెన్యూవల్ చేయకుండానే కొన్ని థియేటర్లను నడిపిస్తున్నారన్నారు. కనీసం లైసెన్స్‌కు కూడా దరఖాస్తు చేసుకోని వారిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నిబంధనలు అతిక్రమించిన 130 థియేటర్లపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు చూసారో తెలీదు..
ఇక హీరో నాని ఎక్కడ ఉంటారో తనకు తెలియదన్నారు. నాని ఏ సినిమా హాల్ పక్కన ఉన్న కిరాణా కొట్టు లెక్కలు చూశారో తనకు తెలియదన్నారు. సినిమా హాళ్ల కౌంటరు. పక్కనే ఉన్న పచారీ కొట్టు కౌంటర్ లెక్కపెట్టి చెప్పి ఉండవచ్చునని అన్నారు. ఇక చెన్నైలో ఉండే నటుడు సిద్ధార్థ వ్యాఖ్యలు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి ఉండొచ్చు. అసలు సిద్ధార్థ్ ఇక్కడ ట్యాక్స్‌లు కట్టారా..?. మేం ఎంత విలాసంగా ఉంటున్నామో సిద్ధార్థ్ చూశాడా..?. స్టాలిన్, మోదీ కోసమో ఆయన ఆ మాటలు అనుంటాడు అని మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.