పుంగనూరులో హింసకు చంద్రబాబే కారకుడు: మంత్రి పెద్దిరెడ్డి
పుంగనూరు హింసలో గాయపడి చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 12:21 PM ISTపుంగనూరులో హింసకు చంద్రబాబే కారకుడు: మంత్రి పెద్దిరెడ్డి
పుంగనూరు హింసలో గాయపడ్డ పోలీసులు.. చిత్తూరు ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న పోలీసులను మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. గాయపడ్డ పోలీసులు త్వరగా కోలుకునేలా చికిత్స అందించాలని వైద్యలను కోరారు. గాయపడ్డ వారిని పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. పుంగనూరులో హింస ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పుంగనూరులో హింసకు ప్రధాన కారకుడు చంద్రబాబే అని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరులో శుక్రవారం జరిగిన హింసకు చంద్రబాబే కారకుడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పక్కా స్కెచ్‌తోనే టీడీపీ నేతలు, కార్యకర్తలతో దాడులు చేయించాడని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయితే.. పుంగనూరు పట్టణానికి చంద్రబాబు రావడం లేదని.. బైపాస్‌లో వెళ్తారని తొలుత సమాచారం ఇచ్చారని.. పోలీసులకు కూడా ఇదే విషయం చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఆ తర్వాత పుంగనూరులోకి వచ్చారంటూ విమర్శలు చేశారు.
చంద్రబాబు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు దాడులు చేయలేదని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీ పాలనలో తమకు జరిగిన అన్యాయం పట్ల నిరసన తెలిపేందుకు వైసీపీ కార్యకర్తలు ఎదురు చూశారని చెప్పారు. చంద్రబాబు అటుగా రావడం లేదని తెలిసి వెళ్లిపోయారని తెలిపారు. కానీ.. టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారని.. దాడులు చేసేందుకు ప్రోత్సహించారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన రూట్‌మ్యాప్‌కు విరుద్ధంగా పుంగనూరుకు వెళ్తుండటంతోనే పోలీసులు ఆయనని అడ్డుకున్నారని తెలిపారు. చంద్రబాబు ఈ వయసులోనూ ఇలాంటి దర్మార్గ పనులకు పాల్పడతారని ఎవరూ ఊహించరని పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే.. ఘర్షణలకు కారణమైన వారిని వదలిపెట్టమని పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.