నారావారిపల్లెలో మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
By - Knakam Karthik |
నారావారిపల్లెలో మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. భోగి వేళ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ను కలిసేందుకు చుట్టపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్.. వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. వారసత్వంగా తమకు సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో అంగప్రదక్షణ భక్తులకు ఆఫ్ లైన్ ద్వారా టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ విధానాన్ని రద్దు చేయాలని ‘తిరుమలలో అంగప్రదక్షణ భక్తబృందం’ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. చిత్తూరు జిల్లా నిండ్రమండలం, కచ్చరావేడు గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని బి.శ్రీనివాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో 150 ఎస్టీ ఎరుకుల కుటుంబాలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయని, ఆయా కుటుంబాలకు ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని శ్రీ వేంకటేశ్వర ఎస్టీ ఎరుకల సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో సొసైటీ విధానంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆఫీసర్లకు ఇతర ఉద్యోగుల మాదిరిగానే వైద్య సదుపాయంతో పాటు శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో తొలగించిన 160 మంది కాంట్రాక్ట్ సూపర్ వైజర్లు, పార్ట్ టైం సూపర్ వైజర్లకు డీఈఎస్ విభాగంలో తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ సూపర్ వైజర్స్ అసోసియేషన్(ఏపీఈఎస్ సీఎస్ఏ) ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. వారసత్వంగా సంక్రమించిన తమ రెండెకరాల భూమిని ఆన్ లైన్ లో నమోదు చేసి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బలిజపల్లికి చెందిన కె.పార్వతి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.