అమరావతి: ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నిర్మాణానికి సహకరించాలని పెప్సికో మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఇంద్రా నూయిని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అభ్యర్థించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ లాస్ వెగాస్ లో జరుగుతున్న ఐటీ సర్వే సినర్జీ సమ్మిట్ క్యాంపస్ లో ఆమెతో సమావేశమయ్యారు. అధికారిక ప్రకటన ప్రకారం.. సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇంద్రా నూయి మద్దతును ఆయన కోరారు.
''విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని ఇంద్రా నూయికి వివరించాను. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎపి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు అవ్వాలని కోరాను. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను'' అని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తెలిపారు.
అటు సినర్జీ సమ్మిట్ సందర్భంగా సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షిహ్‍తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యాను. టెక్ స్టార్టప్‍లకు ఏఐ టూల్స్, మెంటార్ షిప్ అందించాలని .. ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు శిక్షణ ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. విద్యాసంస్థలతో సేల్స్ ఫోర్స్ సంస్థ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశానన్నారు.