అమరావతి: రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు మరింత చేయూత ఇవ్వాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. విద్యా రంగంలో జరుగుతున్న సంస్కరణలపై ప్రధానికి వివరాలు తెలియజేశారు. ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రధాని సహకారం, మార్గదర్శనం అవసరమని పేర్కొన్నారు.
గత 15 నెలలుగా కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామిగా ఉంటుందని లోకేష్ నొక్కిచెప్పారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించినందుకు ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి లోకేష్ ప్రధానికి బహుకరించారు.