ఆ పథకంపై త్వరలోనే గైడ్‌లైన్స్ రిలీజ్ చేస్తాం.. మండలిలో మంత్రి లోకేశ్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కీలక ప్రకటన చేశారు.

By Knakam Karthik  Published on  4 March 2025 11:34 AM IST
Andraprdesh, Assembly Sessions, AP Minister Lokesh, Thalliki Vandanam Scheme

ఆ పథకంపై త్వరలోనే గైడ్‌లైన్స్ రిలీజ్ చేస్తాం.. మండలిలో మంత్రి లోకేశ్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు. తల్లికి వందనం పథకంపై త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించనున్నట్లు ప్రకటించారు. కాగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్‌ సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

కాగా సూపర్‌సిక్స్‌ పథకంలో ఒకటైన తల్లికి వందనం పథకం కింద 15వేల రూపాయలను కొత్త విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు. తల్లికి వందనంతో పాటు, మొత్తం పాఠశాల విద్యాశాఖకు బడ్జెట్‌లో రూ.31,805 కోట్లను కేటాయించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రూ. 15 వేల చొప్పున అందిస్తామని కూటమి తెలిపింది. ఆ హామీ అమలు దిశగా.. వచ్చే అకడమిక్‌ విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఒకటి తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు.. ఏడాదికి రూ. 15,000 చొప్పున తల్లికి వందన పేరుతో అందించనుంది. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనున్నారు.

Next Story