అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్(ప్రత్యేక ఆర్థిక మండలి)లోని సీడ్స్ దుస్తుల కంపెనీలో విషవాయువు లీకైన ఘటనపై పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జరిగిన ప్రమాదానికి సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలన్నారు.121 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. బాధితుల చికిత్సకు ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బాధితులను అయిదు ఆస్పత్రుల్లో జాయిన్ చేశామని, వారిలో ఎవరి ప్రాణానికి ప్రమాదం లేదన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేయిస్తామని, సీడ్స్ కంపెనీకి నోటీసులు ఇచ్చామని, తప్పు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీడ్స్‌కంపెనీని తక్షణమే మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు అన్నింటిపైన సేఫ్టీ అడిట్ జరుగుతందన్నారు. గతంలో(రెండు నెలల క్రితం) ఇదే కంపెనీలో గ్యాస్ లీకైందని, అప్పుడు క్లోరిఫైపాలిష్ అనే రసాయనం వెలువడినట్లు తెలిసిందన్నారు. ఈరోజు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లండిచారు.