ఏపీకి ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసిన ప్రతిసారి విభజన చట్టంలోని అంశాలను అడుగుతున్నామన్నారు.
ఇక ఎవరు ఎన్ని చెప్పానా.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అది తమ విధామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందన్నారు. 'మూడు రాజధానుల నిర్ణయం మా విధానం. ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం. మూడు రాజధానుల బిల్లులో లోపాలు సవరించి.. కొత్త బిల్లుతో ముందుకొస్తాం. ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో ఉంది. పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టంగా చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రత్యేక హోదాని సాధించేవరకు పోరాటం చేస్తాం. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసిన ప్రతిసారి విభజన చట్టంలోని అంశాలపై అడుగుతున్నాం. ప్రభుత్వ సాధన అనేది మా ప్రభుత్వ విధానం' అని బొత్స సత్యనారాయణ అన్నారు.