అమరావతి: రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూములను ఆధార్, సర్వే నంబర్లతో లింక్ చేస్తామని చెప్పారు. రైతులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి కొత్త పాస్‌బుక్‌లు ఇస్తామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 'మీ భూమి-మీ హక్కు' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహించిన విషయం తెలిసిందే.
గ్రీవెన్స్ ద్వారా ఇప్పటి వరకు 4.63 లక్షల ఫిర్యాదులు రాగా.. 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. త్వరలోనే మిగతా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనగాని పేర్కొన్నారు. ఇవాళ అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రెవెన్యూ శాఖపై అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో ఏడాది కాలంలో రెవెన్యూ శాఖలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడంతోపాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన విధానాలపై చర్చించడం జరిగిందని మంత్రి అనగాని తెలిపారు.