కళ్లు కనిపించడం లేదనే చంద్రబాబుకి బెయిల్‌: అంబటి రాంబాబు

ఏపీ హైకోర్టు తీర్పుపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  31 Oct 2023 1:03 PM IST
minister ambati rambabu, counter, tdp, chandrababu, bail,

కళ్లు కనిపించడం లేదనే చంద్రబాబుకి బెయిల్‌: అంబటి రాంబాబు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్‌ దొరికింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు కండీషన్లతో బెయిల్‌ ఇచ్చింది. 53 రోజుల తర్వాత చంద్రబాబు రాజమండ్రి జైల్‌ నుంచి బయటకు వస్తుండటంతో.. టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం గెలిచిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టు తీర్పుపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా టీడీపీ నాయకులకు కౌంటర్లు వేశారు.

టీడీపీ, జనసేన పార్టీలపై సోషల్ మీడియా వేదికగా మంత్రి అంబటి రాంబాబు తరచూ విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ రావడంపైనా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. టీడీపీ నాయకులు నిజం గెలిచింది కాబట్టి చంద్రబాబుకి బెయిల్‌ దక్కిందని అంటున్నారని.. కానీ అది నిజం కాదన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబుకి కళ్లు కనిపించడం లేదు కాబట్టి బెయిల్ వచ్చిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబుకి బెయిల్‌ వచ్చిందని టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే.. మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్‌పై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు టీడీపీ మద్దతుదారులు మంత్రి అంబటి ట్వీట్‌పై తీవ్రంగా స్పందిస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇక అంతకు ముందు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా స్పందించారు.‘జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయం అయింది... పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాదు తెలంగాణలో చేతులెత్తేసిన తెలుగుదేశం... త్వరలో ఏపీలో కూడా అంటూ ఎద్దేవా చేస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story