రాష్ట్రంలో ఏ ఖైదీకి ఇవ్వని విధంగా చంద్రబాబుకి ఏసీ ఇచ్చారు: మంత్రి అంబటి
ఏపీలో ఇప్పటి వరకు ఏ ఖైదీకి ఏసీ ఇచ్చిన దాఖలాలు లేవు కాని.. చంద్రబాబుకి ఇచ్చారన్నారు మంత్రి అంబటి రాంబాబు.
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 12:00 PM GMTరాష్ట్రంలో ఏ ఖైదీకి ఇవ్వని విధంగా చంద్రబాబుకి ఏసీ ఇచ్చారు: మంత్రి అంబటి
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. టీడీపీ నాయకులు ప్రభుత్వం చంద్రబాబు హెల్త్‌పై కుట్ర చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నారా లోకేశ్ అయితే చంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ ఆరోపణలను మాత్రం వైసీపీ ప్రభుత్వ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం సరిగ్గానే ఉందని.. ఆయన బరువు కూడా తగ్గలేదని చెబుతున్నారు. తాజగా చంద్రబాబు ఆరోగ్యంపై ముసుకురుకున్న వివాదంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
ఏపీలో ఇప్పటి వరకు ఏ ఖైదీకి ఏసీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు మంత్రి అంబటి రాంబాబు. కానీ.. చంద్రబాబుకి ఆ సదుపాయం అధికారులు కల్పించారని తెలిపారు. కోర్టు ఏం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని.. ఖైదీలకు ఏం ఇవ్వాలో.. ఏం ఇవ్వొద్దో నిర్ణయించాల్సింది కోర్టేనని చెప్పారు అంబటి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ముందు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తరఫున వాదిస్తున్న న్యాయవాదులు ఏ ఒక్క రోజు కూడా ఏసీ పెట్టించాలంటూ కోర్టులో అడిగారా అని ప్రశ్నించారు. అయితే.. చంద్రబాబు పరిస్థితి బాగోలేదు.. 5 కిలోల బరువు కూడా తగ్గారని.. ప్రాణాపాయం ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారని చెప్పారు. అంతేకాదు.. స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని.. అవన్నీ అవాస్తవాలే అని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
చంద్రబాబుకి చర్మ సంబంధిత సమస్యలు ఎప్పట్నుంచో ఉన్నాయని అందరికీ తెలుసన్నారు. వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైల్లోకి రాకముందు 66 కిలోలు ఉన్నారని.. కానీ ఆయన ఇప్పుడు 67 కిలోల బరువు ఉన్నట్లు చెప్పారు. బరువు తగ్గారని టీడీపీ నాయకులు చెబుతున్న మాటలన్నీ దీంతో అబద్దాలని తేలిపోయిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ నాయకులు ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకుని.. హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.