అమరావతి: రాష్ట్రంలో టమాట, ఉల్లిపాయల ధరల నియంత్రణ అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి 13 జిల్లాల్లో వెంటనే రాయితీపై టమాట, ఉల్లిపాయలు విక్రయం జరపాలని ఆదేశించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో టమాట రూ.70 నుండి రూ.75 వరకు ఉందని రైతుబజార్లలో రూ.63 గా ఉందని .. దీనిని సబ్సిడీపై అనగా కిలో టమాట రూ.50 లకే విక్రయించాలని తెలిపారు.
మిగతా రాయలసీమ జిల్లాల్లో ధర రూ. 50 కంటే తక్కువగానే ఉందని.. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలు కొనసాగేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. లాభనష్టాలను పక్కనపెట్టి ప్రజల అవసరాలకనుగుణంగా కిలో ఉల్లిపాయలను రూ.40 నుండి రూ.45 కే విక్రయించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని రైతు బజార్లలో కూరగాయల ధరల జాబితాను ప్రదర్శించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.