శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గోవిందపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాస్ అనే 25 ఏళ్ల యువకుడు తాను చనిపోతూ నలుగురికి ప్రాణం పోశాడని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ మృతి చాలా బాధాకరమని మంత్రి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు తమ బిడ్డ అవయవాలను దానం చేయాలనే నిర్ణయంతో కిడ్నీ, గుండె, కాలేయంతో పాటు ఇతర అవయవాలను ఆసుపత్రికి అప్పగించడం ఆదర్శనీయమని అన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శ్రీకాకుళంలోని జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయిన శ్రీనివాస్ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈనెల 14వ తేదీన విశాఖపట్నం నుంచి ఓ రోగిని.. శ్రీనివాస్ నరసన్నపేటకు కారులో తరలిస్తుండగా పెద్దపాడు సమీపంలో కేంద్రీయ విద్యాలయం వద్ద లారీ ఢీకొంది. దీంతో బలమైన గాయాలు కావడంతో కొమాలోకి వెళ్లాడు. శ్రీనివాస్ బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు శుక్రవారం ముందుకొచ్చారు. దీంతో ఆయన కిడ్నీ, గుండె, కాలేయంతో పాటు ఇతర అవయవాలను ఆసుపత్రికి అప్పగించారు. అనంతరం జొన్నలపాడు గ్రామంలో దహనసంస్కారాలు చేశారు.