పల్నాడు జిల్లాలో 3.5 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.

By -  అంజి
Published on : 19 Feb 2026 8:02 AM IST

Palnadu Earthquake, Vinukonda Earthquake Today, 3.5 Magnitude Quake AP, National Center for Seismology

పల్నాడు జిల్లాలో 3.5 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) అందించిన గణాంకాల ప్రకారం భూకంప వివరాలు ఇలా ఉన్నాయి.

తీవ్రత: రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదు.

సమయం: తెల్లవారుజామున 02:33:54 (IST).

కేంద్రం: వినుకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతున (Lat: 16.19 N, Long: 79.62 E) కేంద్రీకృతమై ఉంది.

పల్నాడు జిల్లాలోని వినుకొండ, ప్రకాశం జిల్లాలోని దర్శి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. నిశ్శబ్దంగా ఉన్న తెల్లవారుజాము సమయంలో భూమి లోపల నుంచి వింత శబ్దాలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇంట్లోని పాత్రలు, అల్మారాల్లోని వస్తువులు కదలడం, ఫ్యాన్లు ఊగడం వంటి దృశ్యాలతో జనం బెంబేలెత్తిపోయారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం గానీ, భారీ ఆస్తి నష్టం గానీ జరగలేదని అధికారులు ధృవీకరించారు.

ప్రస్తుతానికి ప్రమాదం తప్పినప్పటికీ, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగర్భంలోని పలకల సర్దుబాటు కారణంగా ఇలాంటి స్వల్ప భూకంపాలు సంభవిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పాత భవనాల్లో ఉండేవారు, పగుళ్లు ఇచ్చిన గోడల చెంత ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానిక యంత్రాంగం కోరింది.

Next Story